ప్రధానికి కూడా లేనంతగా జగన్ తన ఇంటికి భద్రతను ఏర్పాటు చేసుకున్నారు: బీసీ జనార్ధన్ రెడ్డి

  • జగన్ ది ముమ్మాటికీ గొడ్డలి పార్టీనే అన్న జనార్ధన్ రెడ్డి
  • రాజారెడ్డికి ఉండే క్రూరత్వం జగన్ కు వచ్చిందని వ్యాఖ్య
  • జగన్ ఇంకా బెదిరించే స్వభావంతోనే మాట్లాడుతున్నారని మండిపాటు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి, వైసీపీ మధ్య ఆరోపణల పర్వం మరింత వేడెక్కింది. వైసీపీ అధినేత జగన్ రాజకీయ శైలిపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ ది ముమ్మాటికీ గొడ్డలి పార్టీనే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రంలోని గ్రామాల్లో ఎన్ని రాజకీయ హత్యలు జరిగాయో తమ వద్ద పూర్తి వివరాలు ఉన్నాయని, వాటన్నింటినీ ఆధారాలతో సహా నిరూపిస్తామని మంత్రి సవాల్ విసిరారు.


జగన్ హయాంలో సాగిన అరాచకాలను, ఫ్యాక్షన్ ధోరణిని భరించలేకనే రాష్ట్ర ప్రజలు గత ఎన్నికల్లో వైసీపీ 151 సీట్ల నుంచి కేవలం 11 స్థానాలకు పరిమితం చేసి గట్టి బుద్ధి చెప్పారని జనార్దన్ రెడ్డి గుర్తుచేశారు. దేశంలో ప్రధానమంత్రికి కూడా లేని విధంగా తన చుట్టూ ఇనుప కంచెలు, అసాధారణమైన భారీ భద్రతను ఏర్పాటు చేసుకున్న జగన్... ఎంతటి తీవ్ర అభద్రతా భావంతో బతుకుతున్నారో అర్థం చేసుకోవచ్చని ఎద్దేవా చేశారు. నాటి వైఎస్ రాజారెడ్డిలో ఉండే క్రూర స్వభావాలన్నీ ఇప్పుడు జగన్‌కు వచ్చాయని మంత్రి దుయ్యబట్టారు. 11 సీట్లకు పడిపోయినా జగన్ ఇంకా బెదిరించే స్వభావంతోనే మాట్లాడుతున్నారని, రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలను, పెట్టుబడిదారులను భయపెట్టేలా ఆయన ధోరణి ఉందని మండిపడ్డారు.


దాదాపు 28 సంవత్సరాల క్రితం జరిగిన రాజారెడ్డి హత్య గురించి జగన్ ఇప్పుడు కొత్తగా మాట్లాడటాన్ని మంత్రి తప్పుపట్టారు. "గత ఐదేళ్లు మీరే అధికారంలో ఉన్నారు కదా.. మరి మీ ప్రభుత్వంలో మీ కుటుంబంలో జరిగిన హత్యలపై ఎందుకు పూర్తిస్థాయి విచారణ జరిపించి నిజాలు తేల్చలేదు?" అని జగన్‌ను నిలదీశారు. ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం ఎంతో ప్రశాంతంగా సాగుతోందని, ప్రజల్లో శాంతిభద్రతలపై నమ్మకం పెరిగిందని స్పష్టం చేశారు. అలాగే, వాస్తవాలు రాస్తున్న పత్రికా ప్రతినిధులపై వైసీపీ శ్రేణులు దాడులకు తెగబడటం పట్ల మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


Jagan Mohan Reddy
BC Janardhan Reddy
Andhra Pradesh Politics
YSRCP
TDP
Political Murders Andhra Pradesh
YS Rajasekhara Reddy
Andhra Pradesh Government
Political Violence
Telugu Desam Party

More Telugu News